అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

నల్గొండ జిల్లా రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర, అంత్యక్రియలపై కుటుంబసభ్యులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మొయినాబాద్ లోని ఫాంహౌస్‌లో పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ అంత్యక్రియలు జరపాలని కుటుంబసభ్యులు భావించారనే వార్తలు వచ్చాయి. అయితే హరికృష్ణ పార్థివదేహం ఆయన స్వగృహానికి చేరుకున్న తర్వాత… సీఎం కేసీఆర్‌తో కలిసి నివాళులర్పించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్… సీఎం చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడి… అంత్యక్రియలపై ప్రకటన చేశారు.

హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఏలోటు లేకుండా చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని… నివాళులు అర్పించేందుకు వచ్చే అందరికీ అసౌకర్యం కలగకుండా చేస్తామన్నారు.