అనుష్క రీమేక్ కు అంగీకరిస్తుందా..?

రీసెంట్ గా భాగమతి అనే హార్రర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క .. మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందిన లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘నాచియార్’. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై, మంచి టాక్‌ అందుకుంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో జ్యోతిక పోలీసు అధికారిణిగా కనిపించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు తమిళ చిత్రాలను తెలుగులో డబ్‌ చేసి రిలీజ్ చేసిన కోనేరు కల్పన, నాచియార్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈసినిమాను డబ్‌ చేయకుండా తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. దర‍్శకుడు బాలా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అం‍తేకాదు తమిళ్‌లో జ్యోతిక చేసిన పాత్రను తెలుగులో అనుష్క చేస్తే బాగుంటుందని బాల సూచించారు. దీంతో అనుష్క అంగీకరస్తే నాచియార్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.