అమరావతి బాండ్లపై ఉండవల్లి ఫైర్

అమరావతి అభివృద్ధి కోసం అధిక వడ్డీకి అప్పు తేవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అమరావతి బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36 శాతం అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ అమరావతి బాండ్లలో బ్రోకర్‌కు రూ.17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న పారదర్శకతా అని ప్రశ్నించారు. పారదర్శకతలో ‘అవార్డ్’ తీసుకున్న చంద్రబాబు కనీసం వారం రోజులకైనా ప్రజలకు లెక్కలు చెప్పాలన్నారు.

అమరావతి బాండ్లు కొన్న 9 మంది పేర్లను చంద్రబాబు బయటపెట్టాలని ఉండవల్లి డిమాండ్‌ చేశారు. అప్పు ఇచ్చేవాడు దొరికినా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్న ఉండవల్లి.. విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు ఒకప్పటి సలహాదారుడు పాస్కల్‌.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ జైల్లో ఉన్నాడని ఉండవల్లి చెప్పారు. పెట్రోలు, మద్యంపై ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీ ప్రభుత్వం పన్నులు వేస్తోందని.. రూ.50 క్వార్టర్‌ బాటిల్‌లో రూ.37 ప్రభుత్వమే దండుకుంటోందన్నారు. మందుబాబులు ఓ వారం రోజులు స్ట్రైక్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆరోపించారు. నాలుగేళ్లలో లక్షా 30 వేల కోట్ల అప్పు చేశారని, ఇంత అప్పు చేసి దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.