అమెరికా తెలుగు సంఘాలకు చిక్కులు

చికాగో సెక్స్ రాకెట్ ప్రభావం అమెరికాలోని అన్ని తెలుగు సంఘాలపై పడింది. కిషన్‌ మోదుగుమూడి దంపతుల వల్ల అమెరికా తెలుగు సంఘాలకు కొత్త కష్టం వచ్చిపడ్డట్టయింది. తెలుగు సంఘాలకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం లేకపోయినా మోదుగుమూడి దంపతులు వాటి పేర్లు వాడుకున్నారు. వచ్చే నెలలో అమెరికాలోని ఓ ప్రముఖ తెలుగు సంఘం నిర్వహించబోయే కార్యక్రమానికి సినీతారలకు వీసాలు నిరాకరించడంతో పాటు ఇతర ప్రముఖుల విషయంలోనూ అమెరికా పోలీసులు భారీ కోత విధించినట్లు సమాచారం.

మామూలుగా అయితే ఈ సంఘాల నుంచి ఆహ్వానం అందిన వారందరికీ తాత్కాలిక వీసాలు మంజూరు చేస్తుంటారు. మోదుగుమూడి ఉదంతాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తుండటంతో వీసాలు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా ఈ కార్యక్రమాలకు సినీ తారలను ఎందుకు పిలుస్తున్నారని అక్కడి సాంస్కృతిక సంస్థలను అమెరికా పోలీసులు ప్రశ్నించగా కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు, ఎక్కువ మంది హాజరయ్యేందుకు సినీ తారలను రప్పిస్తామని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికాలోని తెలుగు సంఘాల సమాధానంపై అధికారులు అంతగా సంతృప్తి చెందలేదు. ఇందులో ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారు. తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారని వాపోతున్నారు. భవిష్యత్తులో సమావేశాలు ఎలా నిర్వహించాలా అని సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.