“అరణ్య”గా రానా

రానా హీరోగా ప్రధాన పాత్రలో నటిస్తున్నకొత్త చిత్రానికి అరణ్య అనే టైటిల్ ఖరారు చేసారు. అలనాటి సూపర్ హిట్ హిందీ చిత్రం “హాథీ మేరే సాథీ” రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను హీరో రానా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సినిమాను తెలుగులో అరణ్య, హిందీలో అదే పేరు (హాథీ మేరే సాథీ)తో తమిళంలో కాదన్ పేరుతో 3 భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్‌లో 1971లో వచ్చిన “హాథీ మేరే సాథీ” చిత్రంలో రాజేశ్ ఖన్నా హీరోగా నటించారు. కథలో కొన్ని మార్పులు చేసి ఈ చిత్రం రాజేశ్ ఖన్నాకు నివాళిగా తెరకెక్కిస్తున్నారట. ప్రభు సోలోమన్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం కోసం రానా బరువు తగ్గారట. అడవిలో ఏనుగులు అంతరించిపోతున్న తీరు, వాటిని సంరక్షించే విధానం నేపథ్యంలో తెరకెక్కబోతుందట. ఈ సినిమా కోసం రానా 15 రోజుల పాటు ఏనుగులతో కలిసి ఉన్నారట. భారత్‌లోని కొన్ని ప్రదేశాలతో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీకరణ జరుపుకుందట.