ఆ సినిమాలో చిరు డబల్‌ రోల్‌?

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న మెగాస్టార్‌ చిరంజీవి మరో వైపు కొరటాల శివతో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు సమాచారం. దీనిపై సోషల్‌ మీడియాలోనూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన రావాల్సివుంది. దాదాపు కొరటాల శివతో సినిమా ఖరారు అయినట్లు సినీ వర్గాల టాక్‌. అయితే ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త హల్‌చల్‌ చేస్తోంది. కొరటాలతో చేయబోయే సినిమాలో చిరంజీవి డబల్‌ రోల్‌ చేయబోతున్నాడని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ లో ప్రారంభించే అవకాశాలున్నట్లు అంటున్నారు.

ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ శరవేగంగా తెరకెక్కుతోంది. కొణిదల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలు నైట్‌ ఎఫెక్ట్‌ తో రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.