ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు నామినేటైన ‘మహానటి’

ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు ‘మహానటి’ నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వచ్చిన చిత్రం మహానటి. ఈ చిత్రాన్నికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘మహానటి చిత్రం విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నందుకు చాలా సంతృప్తికరంగా ఉంది.

మా సినిమా 3 కేటగిరీల్లో ఎంపికైనందుకు గర్వంగా ఉంది’ అని తెలిపారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీ పడుతోంది. ఈ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి కేటగిరీలో దీపిక పదుకొణె (పద్మావత్‌), ఆలియా భట్‌ (రాజీ), రాణీ ముఖర్జీ (హిచ్‌ కీ), విద్యా బాలన్‌ (తుమ్హారీ సులు)లతో కీర్తి సురుశ్‌ పోటీ పడునున్నారు. ఉత్తమ సహాయ నటుల పాత్రల్లో విక్కీ కౌశల్‌ (సంజు), రిచా చద్దా (లవ్‌ సోనియా)లతో సమంత పోటీ పడనున్నారు. ఆస్ర్టేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆగస్టు 10వ తేదీనుండి ఈ ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది.