ఇకనైనా ఈ ప్రచారాలు ఆపండి!

సెకండ్ ఇన్నింగ్స్ లో అతిలోకసుందరి శ్రీదేవి తన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో మరోసారి తన ప్రతిభను కనబరిచింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘మామ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్న శ్రీదేవికి చాలా ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇటీవల బాహుబలిలో శివగామి పాత్రను అంగీకరించనందుకు తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ ఘాటు సమాధానాలు ఇచ్చింది. అలానే ఆమె తన ఇద్దరి కూతుళ్లపై వస్తోన్న వార్తలపై స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె ఇద్దరి కూతుళ్లకు లేట్ నైట్ పార్టీలంటే చాలా ఇష్టమని, పార్టీలు చేసుకొని తెల్లవారుజామున ఎప్పుడో ఇంటికి వస్తుంటారనే వార్తలు వినిపించాయి.
ఈ విషయమై స్పందించిన శ్రీదేవి.. జాన్వీ ఒకసారి ‘ఇంగ్లిష్ వింగ్లీష్’ డైరెక్టర్ గౌరీ షిండేతో పార్టీకు వెళ్లింది. అప్పుడు మీడియాలో ఆమె ఎవరో అబ్బాయితో పార్టీకి వెళ్ళినట్లుగా న్యూస్ వచ్చింది. రీసెంట్ గా జాన్వీ నోస్ సర్జరీ చేయించుకున్నట్లుగా రాస్తున్నారు. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడినుండి పుట్టుకొస్తాయో అర్ధం కావడంలేదు. నాపై వచ్చిన వార్తలు చాలు.. ఇప్పుడు నా కూతుళ్లతో కూడా ఆడుకుంటున్నారా..? వాళ్ళు చిన్నపిల్లలు. ఈ వార్తలను భరించలేరు. ఇకనైనా ఈ ప్రచారాలను ఆపండి అంటూ వెల్లడించారు శ్రీదేవి.