ఎన్టీఆర్‌తో పోటీ పడుతున్న వర్మ ‘భైరవగీత’

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘భైరవగీత’. నూతన దర్శకుడు టి.సిద్ధార్థ‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తోంది. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాను అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వర్మ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే అదే రోజు ‘అరవింద సమేత’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘నూతన దర్శకుడు సిద్ధార్థ తన సినిమా భైరవగీత ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అరవింద సమేత కు పోటీగా విడుదల చేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

దీంతోపాటు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘అభిషేక్‌ నామా, రామ్‌గోపాల్‌ వర్మ, భాస్కర్‌ రాశీ కలిసి నూతన దర్శకుడు సిద్ధార్థ ‌భైవరగీత సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ అరవింద సమేత తో విడుదల చేయాలని నిర్ణయించారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ప్రేమకథ ఇది. ఆసక్తికరంగా అరవింద సమేత చిత్రం కూడా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తీస్తున్నారు అని ప్రకటనలో తెలిపారు. సిద్ధార్థ తన రెండో సినిమా కోసం అభిషేక్ పిక్చర్స్‌ సంస్థతో కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే.