ఎన్టీఆర్ ఫ్యామిలీను కలిసే ప్రసక్తే లేదు!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కనున్న ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వర్మపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న వారిపై వర్మ ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన బయోపిక్ ను తెరకెక్కించాలంటే.. సదరు కుటుంబ సభ్యులను సంప్రదించి వారి అనుమతి తీసుకోవడం జరుగుతుంటుంది. గతంలో వర్మ యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు చేసినప్పుడు సదరు వ్యక్తులను సంప్రదించాడు. 
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిసే ప్రసక్తే లేదని అంటున్నాడు వర్మ. ఎన్టీఆర్ కు సహాయకులుగా పని చేసిన ఇంట్లో వంట మనుషులు, డ్రైవర్లని కలుస్తానని ఇప్పటికే కొంతమందిని కలిశానని స్పష్టం చేశారు. అలానే ఈ బయోపిక్ లో అందరూ కొత్తవారే ఉంటారని ఎన్టీఆర్ పాత్రధారిని కూడా ఎంపిక చేశామని అన్నారు.