ఎన్నికలు నెలే.. ఏపీలో ఎవరికి లాభం..

దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికల సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. ఆదివారం రాత్రి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఎన్నికల కోలాహాలం మొదలైంది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో..అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వెదర్‌ హీటెక్కింది. ఎందుకంటే ఇక్కడ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆదివారం విడుల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఏపీ అసెంబ్లీలో 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25వ తేదీ నాడు చివరిగా నామినేషన్లు వేసుకోవచ్చు. 26న పరిశీలన జరిపితే, 28 వరకు గడువు విధించారు. చివరకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయానికి కేవలం నెలరోజులే వ్యవధి ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని పార్టీలకు ఈ వ్యవధి తక్కువైనా మరికొన్ని వాటికి మాత్రం షెడ్యూల్‌ అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్‌ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అధికారం ఉండడంతో మరోసారి పీఠంపై కూర్చునేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఇదివరకు రకరకాల స్కెచ్‌లను వేస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఉత్తేజపరుస్తోంది. కొన్నిచోట్ల అభ్యర్థులను కూడా ఖరారు చేసిన టీడీపీ మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుబడుతోంది. ఎన్నికల సమయం కేవలం నెల మాత్రమే ఉండడంతో ఈ నెలరోజుల్లో ఎలా ప్రజల్లోకి వెళ్లాలనే వ్యూహాన్ని పార్టీ అధినేత బాబు రచిస్తున్నారు. ఈనెల 13 నుంచి ప్రచారంలోకి దిగనున్నట్లు ప్రకటించిన బాబు ప్రజలను ఏ విధంగా ఆకర్షించాలో ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం.

వైసీపీ అధినేత జగన్‌ ఇప్పటికే సంకల్పయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. దీంతో ఈ కొద్దిరోజులు రాష్ట్రం మొత్తం ప్రచారం చేయకున్నా అనుకూల పరిస్థితే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక టీడీపీ నుంచి వలసలతో వైసీపీ జోరు మీద ఉందని ఫ్యాన్‌ పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. మరోవైపు జగన్‌ ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. కొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో అధికారం దగ్గరకు వచ్చి చేజారడంతో.. ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి జగన్‌ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అభ్యర్థుల విషయంలో దాదాపు నెల రోజుల ముందు నుంచే గెలుపు గుర్రాలను బరిలో దింపే పనిలో జగన్‌ సమాయత్తమవుతున్నారు. రెండు,మూడు రోజుల్లో ఫైనల్‌ చేయనున్నారు.

ఇక జనసేన, వామపక్షాల కలిసి అభ్యర్థులను ఫైనల్‌ చేయనున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులు తమకు కావాల్సిన స్థానాల గురించి జనసేన అధినేత పవన్‌ ముందు ఉంచారు. అయితే పవన్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా ఎన్నికల షెడ్యూల్‌ కోసమే వేచి చూశారని అనుకుంటున్నారు. ఇప్పుడిక తప్పనిసరి కావడంతో ఆ పార్టీ కూడా రెండురోజుల్లోనే అభ్యర్థుల జాబితాను బయటపెట్టనుంది. తమ పార్టీలు ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపుతాయని జనసేన, వామపక్షాలు కలిసి నినదిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అయోమయంగా ఉంది. అభ్యర్థుల కోసం ఈ సారి దరఖాస్తుల ప్రక్రియ విధానం పెట్టినప్పటికీ సీనియర్లు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. కొందరు టీడీపీలోకి జంపింగ్‌ కొట్టగా మరికొందరు పోటీ చేసి పరువు తీసుకోవడమెందుకని వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనన్న ఆసక్తి నెలకొంది. కొత్తవారికి అవకాశం ఇస్తారా..? లేక సీనియర్లను బుజ్జగించి బరిలోకి దింపుతారా..? అన్న చర్చ మొదలైంది.

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో వెళ్లిన బీజేపీ ఈసారి ఒంటరిగానే పోటీకి నిలబడనుంది. అయితే ప్రధాని మోదీ చేస్తున్న కార్యక్రమాలే తమ నాయకులను గెలిపిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాని ఎన్ని స్థానాల్లో బీజేపీ బరిలో ఉంటుందనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.

*నెలరోజులే గడువు ఎవరికి లాభం..?
వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే మూడు సంవత్సరాలు జనంలోనే ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక బాబు మాత్రం జనాలకు చాలా దూరంగా ఉన్నారు. ఈ నాలుగేళ్లు ఆయన ప్రభుత్వ, పాలనను పట్టించుకొని జనాల చెంతకు చేరలేదు. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 23 మందికి ఈసారి ఎలా సీట్లిస్తారు? అక్కడ పాత టీడీపీ వారిని ఎలా మేనేజ్ చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. అక్కడ టీడీపీలో అసమ్మతి రేగడం ఖాయం. జగన్ కు మాత్రం నోటిఫికేషన్ రాగానే 120మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. బాబుతో పోల్చితే నెలరోజులే గడువు జగన్ కే అడ్వంటేజ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో జనంతో మమేకమైన జగన్.. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించి ప్రచారయుద్ధంలో దూసుకుపోవాలని భావిస్తున్నాడు. ఇక చంద్రబాబు మాత్రం ఇప్పుడే ప్రచారాన్ని మొదలుపెడుతున్నారు. సో ఇరువురిలో నెలరోజుల అడ్వంటేజ్ జగన్ కే కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates