“కత్తి మహేష్‌”నగర బహిష్కరణ

కత్తి మహేష్‌పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు హైదరాబాద్ పోలీసులు. ఈ మధ్య ఓ ఛానల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 6 నెలల పాటు హైదరాబాద్‌లో కనపడకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్‌లో అడుగుపెడితే మూడున్నరేళ్ల జైలు శిక్ష పడే నేరమవుతుందని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పారు.

కత్తి మహేష్‌ను తన స్వస్థలం చిత్తూరుకు తరలించారు. అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెడితే వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యాఖ్యలు చేసిన సహించేది లేదన్నారు. అలాంటి వారికి సహకరించిన వారిపైనా చర్యలుంటాయని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తున్నామని, అందుకే నాలుగేళ్లుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. అందుకే అత్యున్నత సురక్షిత ప్రమాణాలుగల నగరంగా హైదరాబాద్‌ అవార్డు అందుకుంటోందని అన్నారు.

భావ వ్యక్తీకరణ పేరుతో కత్తిమహేష్ టీవీ ఛానళ్ల వేదికగా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కొన్ని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా స్పందించాయి. భావ వ్యక్తీకరణ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ దానివల్ల సమాజంలోని ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతి భద్రతలు క్షీణిస్తాయి. అందువల్ల ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించమని అందుకే కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అన్నారు.

హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు. కానీ శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించినా, వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని డీజీపీ తెలిపారు. ఇది సమాజానికి తెలియజేసేందుకే కత్తి మహేష్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఓ టీవీ చానెల్ కత్తి మహేష్‌ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసింది. ఇది సమాజానికి మంచిది కాదు. ఆ టీవీ చానెల్‌కు నోటీసులు జారీ చేశామని డీజీపీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం, ప్రజలు, మీడియాకు బాధ్యత ఉందని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసే వారే శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నిస్తారని ఇలాంటి విషయాల్లో ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా అందరూ సంయమనం పాటించాలని అన్నారు.