కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం-2’

కమల్‌హాసన్ తదుపరి చిత్రం విశ్వరూపం-2 విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. తమిళం, హిందీలో ఒకేసారి రూపొందించిన ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ చేయనున్నారు. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో కమల్‌హాసన్‌ సర్‌ “విశ్వరూపం’ చూశాను. ఒక మనిషి.. ఎన్నో ముఖాలు… ఓ గొప్ప నటుడు నటించిన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం గౌరవంగా ఉంది” అంటూ పేర్కొన్నారు. కాగా తమిళంలో కమల్‌ కుమార్తె శ్రుతి హాసన్‌, హిందీలో ఆమిర్‌ఖాన్‌లు ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ ‘నాజర్‌ను బడికి పంపాలి, జలాల్‌ను కాలేజ్‌కు పంపాలి’ అనే డైలాగ్‌తో మొదలైంది. ‘ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు బ్రదర్‌! కానీ, దేశ ద్రోహం తప్పు’. అని కమల్‌ చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. తొలి భాగానికి మించి ఇందులో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దారు. అదే స్థాయిలో రొమాంటిక్‌ సన్నివేశాలూ ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. ఇందులో కమల్‌హాసన్‌కు జోడిగా పూజాకుమార్‌, ఆండ్రియా జెరీమియా నటిస్తున్నారు. రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్‌ ఈ సినిమాకి సంగీతం అందించారు.

‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ సినిమా విడుదల సమయంలోనే రాజకీయ నేపథ్యంలో వివాదాస్పదంగా తెరకెక్కించారని, సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ‘విశ్వరూపం 2’ రాబోతుండడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్థమౌతుంది.