కర్ణాటకలో “కాలా”కు కోర్టు గ్రీన్ సిగ్నల్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కావేరీ నదీ జలాలపై రజనీకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటక ఫిలించాంబర్ అక్కడ కాలా సినిమాను విడుదల కానివ్వొద్దని నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి కాలా డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్కడి హైకోర్టు తీర్పునిచ్చింది.

తమిళనాడుకు కావేరీ జలాలను కర్ణాటక విడుదల చేయాలంటూ రజినీ కాంత్ వ్యాఖ్యలు చేయడంపై అక్కడి రాజకీయ పార్టీలు కాలా సినిమా విడుదలను అడ్డుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ఫిలిం చాంబర్ సినిమా ప్రదర్శన నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. సినిమాకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని.. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది.