‘కర్వా’ ట్రైలర్‌

హిందీలో ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న తొలి చిత్రం ‘కర్వా’. బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఇందులో కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్‌ కథానాయికగా నటించారు. . ఈ సినిమా ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది.ఈ సినిమాలో దుల్కర్..అవినాశ్‌ పాత్రలో నటించారు. ఈ ట్రైలర్‌లో..అవినాశ్‌కు ఓ ఫోన్‌ వస్తుంది. ‘తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు మీ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వచ్చి ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లండి’ అని చెప్తారు. తీరా అవినాశ్‌ వెళ్లేసరికి అతనికి రెండు మృతదేహాలు చూపించి మీ తండ్రిని తీసుకెళ్లండి అని చెప్తారు. కానీ ఆ రెండు మృతదేహాల్లో ఏ ఒక్కటీ తన తండ్రిది కాదని తెలిసి అవినాశ్‌ షాకవుతాడు. దాంతో కొచ్చికి వెళ్లి మృతదేహాన్ని తీసుకెళ్లమంటారు అధికారులు. అయితే కొచ్చికి వెళ్లేటప్పుడు తనకు ముందు చూపించిన రెండు మృతదేహాలను కూడా వెంటబెట్టుకెళ్లమంటారు.

ఇందుకు అవినాశ్‌.. ట్యాక్సీ డ్రైవర్‌ అయిన షౌకత్ ‌(ఇర్ఫాన్‌ ఖాన్)‌ సాయం తీసుకుంటాడు. షౌకత్ బాధలో ఉన్న అవినాశ్‌ను చూసి ‘ఏమైంది’ అని అడుగుతారు. ఇందుకు అవినాశ్‌..’ నాన్న చనిపోయారు. తీర్థయాత్రల కోసమని గంగోత్రికి వెళుతుంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు’ అని చెప్తారు. ఇందుకు షౌకత్‌.. ‘అరెరె..దేవుడి దర్శనానికని వెళుతుంటే..ఆ దేవుడే అతన్ని తీసుకుపోయాడా?’ అని సెటైర్లు వేయడం నవ్వులు పూయిస్తుంది. ‘ఏడ్చే అమ్మాయిని..పాలు అమ్మేవాడిని ఎప్పుడూ నమ్మకూడదు’ అని ఇర్ఫాన్‌ చెప్పే డైలాగులు ఫన్నీగా ఉన్నాయి.

‘కర్వా’ అంటే ప్రయాణం. రెండు మృతదేహాలతో ఇర్ఫాన్‌, దుల్కర్‌, మిథిలా పాల్కర్‌ల ప్రయాణం ఎలా సాగింది? అన్నదే కథ. ఆకర్ష్‌‌ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్‌ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.