కాళేశ్వరం పంట పండే మేఘా విద్యుత్

దేశంలోనే తొలిసారిగా అత్యధిక సామర్థ్యం కలిగిన ఆరు అతి పెద్దవైన విద్యుత్ సబ్ స్టేషన్ అతితక్కువ కాలంలో పూర్తి చేసి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డును నెలకొల్పింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 400కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లు, మొత్తం 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ లైన్లను ఎంఈఐఎల్ కేవలం రెండేళ్ల కాలంలో పూర్తిచేసింది. 2017 ఫిబ్రవరిలో రామడుగు సబ్ స్టేషన్ పనులతో ప్రారంభించి,ఒక్కో సబ్ స్టేషన్ ను పూర్తిచేస్తూ చివరిగా ఆరో సబ్ స్టేషన్ ను 2019 మే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. అది ఎంతపెద్దదంటే.. 33 జిల్లాల తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం 15,087 మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో 25 శాతం ఉందంటే ఇది ఎంత భారీ వ్యవస్థనో అర్థం చేసుకోవచ్చు.కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,627.24 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, ఇందులో అత్యధికంగా 3,059 మెగావాట్ల విద్యుత్ ను అందించేందుకు అవసరమైన సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. 

ఈశాన్య రాష్ట్రాలకు సమానంగా:కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే మన దేశంలోనిజమ్ము కాశ్మీర్ (3428 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (3356మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలవిద్యుత్ సరఫరా వ్యవస్థకు దాదాపుగా సమానం. అంతేకాదు మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్థ్యం (3916 మెగావాట్లు), కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానం. జార్ఖండ్ (1764 మెగావాట్లు), అసోం(1505 మెగావాట్లు) రాష్ట్రాల విద్యుత్ వ్యవస్థ కంటే రెండు రెట్లు పెద్దది. మన దేశంలోని అండమాన్ నికోబార్, లక్షదీవుల సరఫరా వ్యవస్థతో పోల్చితే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ అక్షరాల అరవై రెట్లు పెద్దది. గోవా, సిక్కిం, డయ్యూడామన్, దాద్రానగర్ హవేళీ, చండీఘర్, పుదుచ్చెరి వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చితే పదుల రెట్లు అధికం. హైదరాబాద్ తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని కొంత భాగాన్ని కలిగి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఈ వేసవిలో దాదాపు 3000 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరమయ్యింది. అంటే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ వేసవిలో గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ అవసరానికిదాదాపుగా సమానం.

 

రికార్డు సమయంలో ఆరు సబ్ స్టేషన్‌లు

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంప్ హౌజ్ లలో ఏర్పాటు చేసిన మొత్తం 43 పంపుమోటార్లకు విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఆరు విద్యుత్ ఉపకేంద్రాలను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6, 12, 14 సబ్ స్టేషన్ లు మినహా మిగతా అన్ని సబ్ స్టేషన్లను, విద్యుత్ సరఫరా లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఎంఈఐఎల్ చేపట్టిన ఆరు సబ్స్టేషన్లతో పాటు ట్రాన్స్ మిషన్ లైన్లను కేవలం రెండేళ్ల కాలంలో పూర్తిచేసి, అందుబాటులోకి తెచ్చింది. ఎత్తిపోతల రంగంలో 400, 220 కేవీ అత్యధిక సామర్థ్యం కలిగిన ఆరు సబ్ స్టేషన్లను ఇంతతక్కువ కాలంలో పూర్తి చేయడం ఎంఈఐఎల్ కే సాధ్యమని మరోసారి నిరూపించుకుంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కు

ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ పంప్ హౌజ్ లో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ రామడుగు వద్ద ఏర్పాటు చేసింది. దీని కోసం 18 కిలోమీటర్ల 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను కూడా ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్, ట్రాన్స్ మిషన్ లైన్ పనులను 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి, కేవలం ఏడాది కాలంలో పనులను పూర్తిచేసి, 2018 మే 6న చార్జ్ చేసి అందుబాటులోకి తెచ్చింది.

తొమ్మిది యూనిట్లతో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించే 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ గడువులోగా పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్ నుంచే 220 కేవీ అన్నారం, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందుతుంది. సుందిళ్ల సబ్స్టషన్, ట్రాన్స్మిషన్ లైన్ పనులను 2017 జూలై 30న ప్రారంభించి, కేవలం ఒక ఏడాది కాలంలోనే అంటే, 2018 జూలై 18న అందుబాటులోకి తెచ్చారు.

ఎనిమిది యూనిట్లతో 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించేందుకు 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ పనులను 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 14న చార్జింగ్ ప్రక్రియను గడువుకన్నా ముందే పూర్తి చేసింది. 440 మెగావాట్ల సామర్థ్యంతో 11 యూనిట్లను కలిగిన మేడిగడ్డ పంప్ హౌజ్ కు విద్యుత్ అందించేందుకు 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ తోపాటు సుందిళ్ల నుంచి 80 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ఏర్పాటు చేశారు. దీని పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 29న చార్జింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయానికంటే ముందుగానే పూర్తి చేశారు.

 

తిప్పాపూర్ సబ్ స్టేషన్ తో ప్యాకేజీ 10కు విద్యుత్:  

సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్ నుంచి 46.115 కిలోమీటర్ల లైన్ తోపాటు చందులాపూర్ నుంచి 19.096 కిలోమీటర్ల క్యూఎండీసీ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్, లైన్ల పనులను 2017 నవంబర్ 8 ప్రారంభించి, 2019 ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చారు. 

సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ 11 రంగనాయకసాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు చందులాపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లి కేటీపీపీ నుంచి గజ్వేల్ సబ్ స్టేషన్ అక్కడి నుంచి చందులాపూర్ వరకు 54.18 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను మే 2017లో ప్రారంభించగా, 2019 మే 6న చార్జింగ్ చేశారు.