కీలక నిర్ణయం తీసుకున్న విశాల్‌

తెలుగు రాష్ర్టాలకు చెందిన రైతుల పట్ల తమిళ నటుడు విశాల్‌ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవలే విడుదలైన తన ‘అభిమన్యుడు’ చిత్రం సాధించిన వసూళ్లలో లాభాలను రైతులకు పంచాలని ఆయన కీలక నిర్ణయం తీస్తున్నారు. ఒక్కో టికెట్‌ పై రూపాయి చొప్పున రైతులకు అందివ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తొలి వారంలోనే ఈ సినిమా రూ.12 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న కథానాయకుడు విశాల్‌. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది. పీ ఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తాజాగా విశాల్‌ నటించిన చిత్రం ‘ఇరుంబు తిరై’. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాలు నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది. కష్టపడి బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును సైబర్‌నేరగాళ్లు ఎలా దొంగిలిస్తున్నారో పూసగుచ్చినట్లు ఇందులో చూపించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌కార్డుల అనుసంధానం, ఇతర అంశాలపైనా ఇందులో సెటైర్లు పడ్డాయి.

జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభిమన్యుడు’ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో విశాల్‌ టికెట్‌ పై రూపాయి చొప్పున రైతులకు అందించాలని కీలక నిర్ణయం తీసుకోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో విశాల్‌ మాట్లాడుతూ..’సినిమాల్లో ఊరికే సంభాషణలు చెప్పడం కాదు. వసూళ్లలో ఎంతో కొంత రైతులకిస్తేనే సంతోషంగా ఉంటుంది. అందుకే తమిళనాడులో ఒక్కో టిక్కెట్టుపై ఒక రూపాయి చొప్పున తీసి రైతులకి అందజేయాలని నిర్ణయించుకొన్నా. తెలుగులోనూ నా ‘అభిమన్యుడు’ కి మంచి ఆదరణ అభిస్తోంది కాబట్టి తెలుగు రాష్టాల్లోని రైతులకి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని మా పంపిణీదారుల్ని కోరుతున్నా. నా మార్కెట్టు ఎప్పుడూ రూ. 15 కోట్లు ఉండాలని నిర్మాత హరి చెబుతుంటాడు. ఈ చిత్రంలో మరోసారి అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఉత్తరాది లో కూడా సినిమాకి ఆదరణ లభిస్తోంది. చాలా రోజుల తర్వాత నాకు ఇంత పెద్ద విజయం లభించడం ఆనందంగా ఉంది. ‘పందెం కోడి 2′ తో అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అన్నారు.