కురచ దుస్తులు వేసుకోకూడదా!

ఈ మధ్య కరీనా ఎక్కడికి వెళ్లినా అసభ్యకరమైన రీతిలో దుస్తులు వేసుకుంటున్నారని ఆమె నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలోనూ ధరించిన దుస్తులు అంతగా బాగోలేవని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే పెళ్లై ఓ బిడ్డ పుట్టినంత మాత్రాన పొట్టి దుస్తులు వేసుకోకూడదా? అని ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్‌ అందాల తార కరీనా కపూర్‌. కరీనాకు 17 నెలల బాబు ఉన్నప్పటికీ జీరో సైజ్‌తో ఆకట్టుకుంటున్నారు.

కరీనా ఈ విమర్శలపై మీడియా ద్వారా స్పందించారు. ఎలాంటి దుస్తులు వేసుకుంటే నప్పుతాయో అలాంటివే వేసుకుంటాం. ‘అమ్మ వేసుకునే దుస్తులు’ అన్న పదాలేంటో నాకు అర్థం కావడంలేదు. మా అమ్మ ఇప్పటికీ మోడ్రన్‌ దుస్తులు వేసుకుంటుంది. ఆమె జీన్స్‌, టాప్‌ వేసుకుంటే మరింత అందంగా కన్పిస్తారు. మా అత్తగారు షర్మిళ ఠాగూర్‌ను చూశారా? ఆమె ఇప్పటికీ జీన్స్‌ వేసుకుంటారు. ఆవిడ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో జీన్స్‌ వేసుకున్నా , అంతే ఆకర్షణీయంగా కన్పిస్తారు. మీకు ఫలానా దుస్తులు నప్పుతాయి అనిపిస్తే వాటిని ధైర్యంగా ధరించండి. నేను గర్భిణిగా ఉన్నప్పుడు కూడా నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సమాజం మహిళకు నచ్చినట్లుగా ఉండే స్వేచ్ఛనివ్వాలి. ఒకప్పుడు కథానాయికల ఆలోచనా విధానం ఎలా ఉండేదంటే.. ఎంత వయస్సు మీరినా 25 ఏళ్లలాగే కన్పించాలని అనుకునేవారు. కానీ, ఇప్పుడు మాపై అలాంటి ఒత్తిళ్లు లేవు. విద్యాబాలన్‌, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, ఆలియా భట్‌.. వీరంతా అలాంటి అభిప్రాయాలను మారుస్తున్నారు. ఇప్పుడు మాపై ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మమ్మల్ని కుదిపేయలేవు. అని చెప్పుకొచ్చారు ‘బెబో’