‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా పై సెలబ్రిటీస్‌ స్పందన!

యంగ్‌ హీరో రానా సురేష్ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమర్పిస్తున్న ‘కేరాఫ్‌ కంచరపాలెం’. ఈ సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి సంగీతం అందిస్తున్నారు. వైజాగ్‌ సమీపంలోని కంచరపాలెం అనే గ్రామం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమాకి వెంకటేశ్‌ మహా దర్శకుడు. ఇందులోని నటీనటులంతా ఆ గ్రామానికి చెందిన వారే కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమా న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు చిత్రం. సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా, ఈ చిత్రం తమ మనసు దోచిందని ఇప్పటికే ఎస్‌.ఎస్‌. రాజమౌళి, క్రిష్‌, సుకుమార్, నాని తదితరులు పేర్కొన్నారు. తాజాగా ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను చూసిన కథానాయిక సమంత, ఇంద్రగంటి మోహనకృష్ణ, అనసూయ, రాశీఖన్నా, సందీప్‌ కిషన్‌ చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా కన్నీళ్లు పెట్టించిందని, భావోద్వేగానికి గురయ్యామని అన్నారు.

సమంత: ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కేరాఫ్‌ కంచరపాలెం ఇప్పుడే చూశా. ఈ సినిమా గురించి నేను పంచుకోవాలి అనుకుంటే మాట్లాడుతూనే ఉండాలి. ఎంత అందమైన సినిమా. థియేటర్‌కు వెళ్లి.. ఈ సినిమాకు ఓ అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని మీరు మైమరచి చిత్రాన్ని చూడండి. సెప్టెంబరు 7న చిత్రం విడుదల కాబోతోంది

రాశీఖన్నా: కేరాఫ్‌ కంచరపాలెం ఎంతో నచ్చింది. ఇది నన్ను నవ్వించింది, ఏడిపించింది. మీరు కూడా ఈ చిత్రాన్ని చూడాలి. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. వెంకటేశ్‌ మహా గారు మీరు బ్రిలియంట్‌

అనసూయ: స్వచ్ఛమైన చిత్రం కేరాఫ్‌ కంచరపాలెం ఈ సినిమా వల్ల ఏడ్చాను, నవ్వాను. ఈ సినిమాలోని పాత్రలు, నటీనటుల నుంచి నా జీవితంలో బయటికి రాలేను. రానా, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. దయచేసి నన్ను ఈ సారి కంచరపాలెం తీసుకెళ్లండి

సందీప్‌ కిషన్‌: తెలుగు సినిమాల్లో కేరాఫ్‌ కంచరపాలెం ప్రత్యేకమైంది. ఎంత చక్కటి చిత్రం. ఈ సినిమాను ఇలా తీర్చిదిద్దిన దర్శకుడు వెంకటేశ్‌ మహాకు కుడోస్‌. అంతర్జాతీయ ప్రమాణాలున్న తెలుగు చిత్రమిది. హృదయంతో సినిమాను తీశారు. అద్భుతంగా పాత్రల్ని రాశారు. నటీనటుల నటన సూపర్‌. తెలుగు చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్తున్న సినిమాలతో రానా అసోసియేట్‌ కావడం చాలా స్ఫూర్తిదాయకం. కేరాఫ్‌ కంచరపాలెం వేడుకను జరుపుకోవాల్సిన అవసరం ఉంది

ఇంద్రగంటి మోహనకృష్ణ: కేరాఫ్‌ కంచరపాలెం సినిమా ఓ అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా నిజాయతీ, భావోద్వేగ తీవ్రత, విశ్వాసంతో.. ట్రెండ్‌ సెట్టర్స్ అనే స్థాయి కన్నా మించిపోయింది. ఇది ఓ స్వచ్ఛమైన సినిమా. ప్రజలు ఇలానే మాట్లాడుకుంటారు, నడుస్తారు, జోక్స్‌ వేసుకుంటారు, ప్రేమలో పడతారు, ద్వేషించుకుంటారు. నిజంగా మీకు తెలుగు సంప్రదాయాలు, భాష, జీవితం నచ్చితే.. తెలుగు వాడిలా ఉండాలి అనుకుంటే కేరాఫ్‌ కంచరపాలెం చూడండి. వెంకటేశ్‌ మహా, రానా, సురేష్‌ ‌బాబు మొత్తం యూనిట్‌కు శుభాకాంక్షలు. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతమైన పనితీరు కనబర్చారు. ఈ సినిమాలో నాకు ప్రవీణ పరుచూరి నచ్చారు