‘క్వీన్‌’ తెలుగులో ‘మహాలక్ష్మి’ గా రానుందా?

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘క్వీన్‌’కు తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్‌ పాత్రలో తమన్నా నటిస్తున్నారు. ముందు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతల్ని నీలకంఠ రెడ్డి చూసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మైసూర్‌లో జరుగుతోందట. అక్కడ తమన్నా, మిగిలిన నటీనటులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ తెలుగు రీమేక్‌ చిత్రానికి ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ అనే టైటిల్‌ ను దర్శక, నిర్మాతలు పరిశీలిస్తునట్లు తాజా సమాచారం. తమన్నా, నాగా చైతన్య హిట్‌ మూవీ ‘100% లవ్‌’. ఇందులో ఆమె ‘మహాలక్ష్మి’ అనే పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రంలో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ అనే పాట కూడా బాగా ఫేమస్‌ అయ్యింది. ఈనేపథ్యంలో టైటిల్‌ ఇదైతే సరిపోతుందని యూనిట్‌ భావిస్తోందట. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు రీమేక్‌ తర్వాతా షెడ్యూల్‌ యూరప్‌లో జరగనుందట. ‘క్విన్‌’ తమిళ రీమేక్‌లో కాజల్‌, మలయాళం రీమేక్‌లో మాంజిమా మొహన్‌, కన్నడ రీమేక్‌లో పరుల్‌ యాదవ్ నటిస్తున్నారు.