గురువారం మరో మలుపు …చికాగో సెక్స్‌ రాకెట్‌

గత వారం చికాగో సెక్స్ రాకెట్ సృష్టించిన పెను కలకలం తాలుకు ప్రకంపనలు అంతా ఇంతా కాదు. సినీ తారలతో వ్యభిచార రాకెట్ వ్యవహారం గురువారం మరో మలుపు తిరగనుంది. సెక్స్ రాకెట్ నడిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళ కోర్టు ముందుకి రానున్నారు. వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే ఉన్న నేరంపై అరెస్టయిన వారిద్దరిని ఇల్లినాయిస్ కోర్టు విచారించనుంది. ఓహియోలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ (యుఎస్ బీపీ) అరెస్ట్ చేసిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభించాయి. కిషన్ దంపతులు అమెరికాలోని తెలుగు సంఘాల పేరిట నకిలీ లేఖలు, ఆహ్వాన పత్రాలు సృష్టించి సినీ తారలను అమెరికా రప్పించి.. వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు 42 పేజీల అభియోగ పత్రం కోర్టుకి సమర్పించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మోదుగుమూడి దంపతుల నేరాలపై తిరుగులేని బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. ఇప్పటికే నిందితుల డైరీల్లో పేర్లున్న ఎన్నారైలు చాలా మంది అప్రూవర్లుగా మారినట్టు పోలీసుల క్రిమినల్ కంప్లెంట్ ద్వారా తెలుస్తోంది. వీరిని కోర్టులో సాక్షులుగా ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తుండటంతో ఈ కేసు నెల రోజులలోపే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కిషన్, చంద్రకళల దగ్గర దొరికిన నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలోని సంభాషణలు, చాటింగ్ విశ్లేషిస్తున్నారు. వాటి ప్రకారం ఇప్పటి వరకు ఆరుగురిని మాత్రమే అమెరికా పోలీసులు బాధితులుగా పేర్కొన్నారు. అయితే కొన్నేళ్లుగా సాగుతున్న కిషన్ దంపతుల చీకటి వ్యాపారంలో మరిన్ని పేర్లు బయటపడితే వారిని కూడా బాధితులుగా చేర్చవచ్చు. కిషన్ దంపతులు నేరాన్ని అంగీకరిస్తే అమెరికా పోలీసుల దర్యాప్తు అక్కడితో ముగుస్తుంది. వారు దర్యాప్తునకు సహకరించకపోతే మాత్రం అమెరికా పోలీసులు హైదరాబాద్ రాక తప్పదు. ఒకవేళ వారు వస్తే ఈ కేసులో మరిన్ని తీగలు కదిలి డొంకలు బయటపడవచ్చు. ఈ వ్యవహారంలో పెద్ద తలకాయల పేర్లూ బయటికొచ్చే అవకాశం ఉంది. గురువారం విచారణ సందర్భంగా ఇల్లినాయిస్ కోర్టు కిషన్ దంపతులకు ఏదైనా శిక్ష విధిస్తే అది పూర్తయిన తర్వాత మాత్రమే ఆ ఇద్దరూ అమెరికా నుంచి స్వదేశానికి రాగలుగుతారు. అప్పటి వరకు చేసిన అక్రమ నివాసం, అక్రమ వ్యభిచారం నేరాలకు ఊచలు లెక్కపెట్టక తప్పదు.