గోపీచంద్‌ ‘పంతం’ మూవీ టీజర్‌

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’.. ‘ఫర్‌ ఎ కాజ్‌’ అన్నది ఉపశీర్షిక. మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. చక్రవర్తి ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు. కాగా..ఈ మూవీ టీజర్‌ ఈ రోజు విడుదలైంది. ‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న కథే’ అంటూ గోపీచంద్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ప్రముఖ హాస్య నటుడు పృథ్వీ..’ఇప్పటికైనా చెప్పండి. మీరేం చేస్తుంటారు? ‘అని గోపీచంద్‌ను, శ్రీనివాస్‌ అడిగితే..’ లోపలిది బయటికి తీస్తాం. బయటిది లోపలకి తోస్తాం. డింగ్‌ డింగ్‌’ అని చెప్తున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది.

‘ఉచిత కరెంట్‌ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు రూ.5000 ఇస్తాం అనగానే ముందు-వెనకా, మంచి-చెడు ఆలోచించకుండా ఓటేసేసి ఇప్పడు అవినీతి లేని సమాజం కావాలి, అవినీతి లేని దేశం కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయ్‌?’ అని న్యాయస్థానంలో గోపీచంద్‌ ప్రశ్నిస్తున్న విధానం టీజర్‌లో హైలైట్‌ గా నిలిచింది. సమాజంలో పేరుకుపోతున్న అవినీతి, వాస్తవిక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. సంపత్‌, జేపీ, తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, ప్రభాస్‌ శ్రీను, హంసా నందిని, ప్రభాకర్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.