గోపీచంద్ బయోపిక్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల ‘గోపీచంద్’ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణాలు వెల్లడించకపోయినా ప్రాజెక్ట్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్‌ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం ఆటకు సంబంధించిన అంశాలతోనే సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో ‘సుధీర్‌ బాబు’, గోపీచంద్‌ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో అదితిరావు హైదరి హీరోయిన్‌గా నటించారు.