చంద్రబాబు ‘చంద్రోదయం’ పెదతాడేపల్లిలో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రపై నిర్మిస్తున్న ‘చంద్రోదయం’ సినిమా చిత్రీకరణ శనివారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో నిర్వహించారు. ఈ సినిమా దర్శకుడు పసలపూడి వెంకటరమణ ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటరమణ, నిర్మాత గండికోట రాజేంద్ర విలేకరులతో మాట్లాడుతూ నారావారిపల్లెలో, హైదరాబాద్‌లోని మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ నిర్విహించామని తెలిపారు. పతాక సన్నివేశాలను తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు టీడీపీకు ఆయన వెన్నెముక అనే అంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందులో చంద్రబాబుగా కర్ణాటక నటుడు అభిషేక్‌, ఎన్టీఆర్‌గా భాస్కర్‌.. వీరితోపాటు మౌనికాచౌదరి, పల్లవి శ్రేష్ఠ కూడా నటిస్తున్నారని వివరించారు. బయోపిక్‌ తీస్తున్నామని చంద్రబాబును గతంలోనే కలిసి వివరించామని తెలిపారు. ఈనెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తిచేయనున్నామని వెల్లడించారు. సెప్టెంబరు మొదటి నెలలో విజయవాడలో ఆడియో ఫంక్షన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబరు మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. చిత్రీకరణ విషయం తెలిసి పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు.