జగన్ గెలుపుపై పచ్చపార్టీ కడుపుమంట

– ఆడలేక మద్దెల ఓడన్నతీరుగా ప్రచారం

– ప్రజల విశ్వాసం పోగొట్టుకుని దారుణమైన ఓటమి మూటకట్టుకున్న టీడీపీ

– తమ ఓటమిని జీర్ణించుకోలేక ఈవీఎమ్ లపై నిందలు

పోస్టల్ బాలెట్టే మంచిది. ఈవిఎమ్ మా కొంప ముంచింది. లేకుంటే ఇంత వ్యత్యాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది అంటూ వింత వితండ వాదనలు లేవదీస్తున్నారు పచ్చతమ్ముళ్లు. తెలుగుదేశం వాళ్లకు రక్తం కూడా పసుపుగానే ఉంటుందని నమ్మే పచ్చకులస్థులు, పచ్చఅభిమానధనులందరి మాట కూడా ఇదే. ఓటమి సరైన కారణాలను విశ్లేషిస్తే దొంగతనాలు, అవినీతి కంపులు బయటపడతాయి కనుక ఇలా నెపాన్ని ఈవిఎమ్ లపైకి , మోదీపైకీ, చివరకు ఎన్నికల కమీషన్ పైకి కూడా నెట్టేస్తున్నారు.

పచ్చ విషప్రచారం

దున్నపోతు ఈనింది అంటే దొడ్డో కట్టేయమన్న చందంగా ఈవీఎమ్ ల టాంపరింగ్ గురించి పచ్చ తమ్ముళ్లు ఒకటికి వంద చేసి చిలవలు పలవలుగావించారు. కొన్ని చోట్ల ఓటర్ల సంఖ్యం కంటే పోలైన ఓట్లు ఎక్కువున్నాయంటూ గడబిడ కూడా చేయబోయారు. కానీ ఈసీ పగడ్బందీగా లెక్కించి చూపించడంతో చెవులూ నోరూ మూసుకుని వెనుతిరిగారు. అయినా సరే ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్నే అవహేళన చేస్తూ, ప్రజల ఎంపికను తప్పు పడుతూ పచ్చపైత్యాన్నంతా కక్కుతున్నారు.

బ్యాలెట్ ఓట్లను తిరస్కరించి

గుంటూరు లో 10,000, శ్రీకాకుళంలో 7000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించిన విషయం ఇటీవలే బయటపడింది. సమయాభావం వల్ల వాటిని లెక్కించలేదంటూ వివరణ ఇచ్చారు. కనీసం బాలెట్ ఓట్లను ఓపెన్ కూడా చేయలేదు. ఆ బూతు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎంతగా వాదించినా అధికారులు మాత్రం ఆలస్యంగా వచ్చాయనే సాకుతో బ్యాలెట్ ఓట్లను లెక్కించలేదు. చంద్రబాబు కోసమే పనిచేసిన అధికారులు చివరి నిమిషం వరకూ స్వామిభక్తితో ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి మరీ పనిచేసారు. ఓ పక్క ఓటు హక్కును కాపాడేందుకు ఆరు దాటినా ఓటింగ్ కు ఈసీ అనుమతి ఇస్తే, అధికారులు కాస్త ఆలస్యం పేరు చెప్పి విలువైన బాలెట్ ఓట్లను పక్కకు నెట్టేసారు. ఒకవేళ వాటిని లెక్కించి ఉంటే ఖచ్చితంగా గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లోని ఎంపీ సీట్లు టీడీపీకి దక్కేవి కావు అనడంలో అనుమానమే లేదు. సగం మంది ప్రభుత్వోద్యోగులకు ఖాళీ కవర్లు పంపి, వారిని ఓటు వేయకుండా చేసిన చంద్రబాబు కుటిల నీతి వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్ శాతాన్ని కొంత మేర తగ్గించింది. వచ్చిన ఓట్లను కూడా కౌంట్ చేసే వీలు లేకుండా పోస్టల్ లేట్ ను క్రియేట్ చేయడం మరో అరాచకం. దీనిపై కోర్టుద్వారా రీకౌంటింగ్ కు వెళ్లే అవకాశం లేకపోలేదు. భారీ మెజారిటీతో అధికారం చేపట్టనున్న వైఎస్సార్సీపీ ఆ దిశగా ప్రయత్నంచేసే అవకాశం కూడా ఉంది.

ఓటమిని హుందాగా ఒప్పుకోవడం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అనేవి చంద్రబాబు చరిత్రలోనే లేవు. అందుకే 2019 ఎన్నికలకు ఈవీఎమ్ లకు, ఈసీకీ, చివరకు తనను నిర్ద్వందంగా తిరస్కరించారనే కక్షతో ప్రజలను కూడా తిడుతూ చరిత్ర హీనుడౌతున్నాడు చంద్రబాబు. పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ ప్రధాని సైతం గౌరవంతో, అభిమానంతో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెబుతున్న తరుణంలో కడుపుమంట పోస్టులతో కాలం గడుపుతున్నారు తెలుగు తమ్ముళ్లు.