జూనియర్ ఎన్టీఆర్‌కు మరో కొడుకు

జూనియర్ ఎన్టీఆర్‌కు మరోసారి కొడుకు పుట్టాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. నా కుటుంబం మరింత పెద్దదైంది, మగబిడ్డ పుట్టాడంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ దంపతులకు తొలి సంతానం అభయ్‌ రామ్ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పుట్టిన ఈ జూనియర్‌కు ఏం పేరు పెడతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌కు సోషల్‌ మీడియాలో అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. దసరాకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.