టీవీ9 రవిప్రకాష్ మెడకు మరో ఉచ్చు..

టీవీ9 రవిప్రకాష్.. అలంద మీడియా సహా దాని వెనుకున్న టీఆర్ఎస్ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. అందుకే తనకు 10 రోజుల గడువు కావాలని తాజాగా సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్ చేశారు. కానీ అలంద మీడియా కానీ.. దాని తెరవెనుకుండి నడిపిస్తున్న రాజకీయ పార్టీ కానీ తమకు కొరకరాని కొయ్యగా మారిన రవిప్రకాష్ ఖేల్ ఖతం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం.అందుకే టీవీ9లో జరిగిన అక్రమాలు.. రవిప్రకాష్ చేసిన మోసాలను తవ్వి తీసి ఇప్పుడు ఉచ్చు బిగిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.
తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు పడింది. ఇప్పటికే ఫోర్జరీ, డేటా చోరీ కేసులుండగా.. తాజాగా చానల్ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపనలపై రవిప్రకాష్ పై కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతోపాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత మొబైల్ టీవీ, వెబ్ చానెల్ కు దొంగచాటుగా బదిలీచేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్ డైరెక్టర్ కౌశిక్ రావు తాజాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
రవి ప్రకాష్ సొంత మొబైల్ టీవీకి టీవీ9 లోగోలను మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేవలం 99వేలకు అమ్మేశారని..టీవీ9కు వచ్చే యాడ్స్ ను కూడా సదురు మొబైల్ టీవీకి మళ్లించారని కౌశిక్ రావు పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఇలా టీవీ9కు వచ్చే కోట్ల యాడ్స్ ను మళ్లించి కంపెనీకి నష్టం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల విలువ చేసే లోగోలను 99వేలకే అమ్మేశారని ఆరోపించారు. లోగోలు అమ్మేసినా మెజార్టీ వాటాదారులకు కనీసం సమాచారం ఇవ్వలేదని కౌశిక్ రావు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుండా రవిప్రకాష్ మోసం చేశాడని విన్నవించారు. ఇప్పటికే రెండు కేసులతో ఉక్కిరిబిక్కిరైన రవిప్రకాష్.. ఇప్పుడు మరో కేసు నమోదు కావడం.. ఆయన భవిష్యత్ అంధకారంలో పడినట్టైంది. రవిప్రకాష్ ఖేల్ ఖతం చేసేందుకే ఇలా ముందుకెళ్తున్నట్టు అర్థమవుతోంది.