‘డిజె’ పైరసీ వివాదం.. ఆ ఫ్యాన్స్ పై అనుమానం!

సినిమా ఇండస్ట్రీలో అందరూ బయటకు కలిసున్నామని చెబుతున్నా.. లోలోపల ఎవరి ఈగోలు వారికి ఉంటాయి. ఎవరికి వారు గ్రూప్ లను మైంటైన్ చేస్తుంటారు. అభిమానులతో కూడా గ్రూప్ లను కట్టించేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉండేంత హిప్పోక్రసీ మరెక్కడా ఉండదు. సినీ ప్రముఖులు ఇచ్చే స్టేట్మెంట్స్, వేరొకరిపై పరోక్షంగా చేసే కామెంట్స్ ఏదొక రకమైన చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘డిజె’ సినిమా పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. సినిమా మొత్తం ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైంది. దీని గురించి దర్శకనిర్మాతలు పోలీసులు ఆశ్రయించారు. అయితే దీనికి దగ్గరగా దిల్ రాజు చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశం అయింది. 
‘డిజె’ వసూళ్లు చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారని, కుళ్ళుకుంటున్నారని అందుకే కావాలని ఇలాంటి యాక్టివిటీస్ చేసి సినిమాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సాధారణంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దిల్ రాజు మాట్లాడడు. ఆయన మాటలను అంత తేలికగా తీసేయలేం. కానీ బన్నీ సినిమాను పైరసీ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. గతంలో కూడా పెద్ద పెద్ద సినిమాలు పైరసీ పాలయ్యాయి. అప్పుడు ఆ సినిమాలకు సంబంధించిన దర్శకనిర్మాతలు దిల్ రాజు మాదిరి పగ లాంటి కామెంట్స్ చేయలేదు. 
అయితే డిజె పైరసీని అరికట్టడంలో మహేష్ బాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహాయం చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు హరీష్ శంకర్. అంటే ఇక మిగిలింది పవన్ కల్యాణ్ అభిమానులే.. ఇండస్ట్రీలో మహేష్, ఎన్టీఆర్, పవన్ లకు తప్ప మిగిలిన ఏ హీరోల అభిమానులు కూడా పెద్దగా గ్రూప్ లను మైంటైన్ చేసినట్లు కనిపించరు. మొన్నామధ్య అల్లు అర్జున్ కు, పవన్ అభిమానుల మధ్య జరిగిన రచ్చ సంగతి తెలిసిందే. ఆ ఎఫెక్ట్ అల్లు అర్జున్ పై బాగా పడిందనే చెప్పాలి. 
‘డిజె’ సినిమా విషయంలో కూడా కావాలని కొందరు పనిగట్టుకొని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే టాక్ ఉంది. దిల్ రాజు కూడా పోలీస్ కంప్లైంట్ లో కొన్ని ఫ్యాన్స్ గ్రూప్ పేజీలపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హరీష్ శంకర్ కూడా కొన్ని ఫ్యాన్స్ పేజీలపై విరుచుకుపడుతున్నాడు. వీరంతా నేరుగా పేరు బయటకు చెప్పకపోయినా.. పరోక్షంగా మాత్రం వారి అనుమానం ఎవరి మీద అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ వివాదాలు ఎప్పటికీ సద్ధుమణుగుతాయో.. చూడాలి!