తండ్రి ముందు నడిచిన వారసత్వం: క్రిష్‌

సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో విషాదం నెలకొంది.. సినీ ప్ర‌ముఖులంద‌రూ సోష‌ల్ మీడియా వేదికగా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫొటోను ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి ట్విటర్‌లో షేర్‌ చేశారు. రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన హరికృష్ణకు నివాళులర్పించారు. ‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ గారు 1962 జాతీయ రక్షణ ఫండ్‌ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్‌ గారి కంటే ముందు నడిచారు,’అని ట్వీట్‌ చేశారు.

క్రిష్‌ ఎన్టీఆర్ బయోపిక్‌ ను తెరకెక్కిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్‌.. ఎన్టీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ ప్రచార రథ సారథిగా ఆయన వెంటే ఉండి తండ్రికి ఎంతో సేవ చేశారు హరికృష్ణ. ఇప్పుడు ఆ పాత్రను కూడా ఎన్టీఆర్ లో చూపించనున్నారు. ఆ పాత్రను కల్యాణ్‌రామ్‌ పోషిస్తారని ప్రచారం జరుగుతున్నా, చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు. మరి వెండితెరపై హరికృష్ణ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.