తాత, తండ్రి అడుగుజాడల్లోనే తనయులు..

ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఆయన తనయులు హీరో కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌. ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ లు తండ్రి మరణం తరువాత ఒంటరివారయ్యారు. ఇంట్లోనే ఉంటె హరికృష్ణ జ్ఞాపకాలతో కోలుకోవడానికి సమయం పడుతుంది. అయితే తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని శనివారం నుంచే తమ సినిమాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌. వృత్తి నిబద్ధతని చాటి చెప్పే విషయమిది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు ‌. కల్యాణ్‌రామ్ గుహన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు ‌.

నిర్మాతలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌లు చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. తాత ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణ కూడా వృత్తి విషయంలో ఇంతే నిబద్ధతతో వ్యవహరించేవారట. చేస్తున్న పనిపై గౌరవం, ప్రేమతో వ్యక్తిగత విషయాల ప్రభావం సినిమాలపై పడకుండా చిత్రీకరణల్లో పాల్గొనేవారట. అందుకే తాత, తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని నందమూరి వారసులు నిర్ణయించుకొన్నారు. కొన్నాళ్లపాటు టాకీ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని కథానాయకుడు మహేష్‌బాబు పరామర్శించారు. మెహిదీపట్నం, ఎన్‌ఎండీసీ సమీపంలోని హరికృష్ణ ఇంటికి శుక్రవారం ఉదయం 11:30 గంటలకు వచ్చిన మహేష్‌బాబు దాదాపు గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపారు.