తెలంగాణలో ప్రత్యామ్నాయాలపై టీడీపీ చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశంపై వారితో చర్చించారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయని పలువురు నేతలు ఆయన వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ వైపునకు వెళ్లకుండా చూసేందుకే కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని నేతలు సీఎంతో అన్నారు.

‘అప్పుడు కాంగ్రెస్‌ అన్యాయం చేసింది.. ఇప్పుడు బీజేపీ ద్రోహం చేసింది. ఇప్పడు కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా ఇస్తానంటోంది. అడ్డుపడేలా బీజేపీ వ్యవహరిస్తోంది’ అని మంత్రులు సీఎంకు వివరించారు. అందరితో చర్చించి, ఇతర పార్టీల వైఖరిని పరిశీలించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమా, సీనియర్‌ నేతలు పయ్యావుల కేశవ్‌, ధూళిపాళ్ల నరేంద్ర, టి.డి.జనార్ధన్‌ తదితరులు సీఎంతో భేటీ అయినవారిలో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.