దీపావళికి విజయ్ “సర్కార్”

తమిళనాట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తరువాత అంతటి ఫాలోయింగ్‌ ఉన్నవిజయ్‌ మాస్‌ హీరోగా కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ఇళయ దళపతిగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇప్పుడు విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో తుపాకి, కత్తి చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. మూడో చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని రెడీ అవుతున్నారు. తాజా చిత్రంలో విజయ్‌కి జోడీగా కీర్తిసురేష్‌ నటిస్తోంది. శుక్రవారం విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘సర్కార్’ టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.

సన్‌పిక్చర్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేత కళ. కరుప్పయ్య, రాధారవి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌ కెరీర్‌లో ఇది 62వ సినిమా. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ లుక్‌తో ఉన్న తన సినిమా పస్ట్ లుక్‌ విడుదల చేసి విజయ్‌ అభిమానులకు పుట్టినరోజు కానుక అందజేశారు.