దేవరకొండ ఇంటికి అతిథిగా కేటీఆర్‌

అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగారు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంకా అర్జున్‌ రెడ్డిని మర్చిపోలేక పోతున్నారు సినీ జనాలు. అర్జున్‌ రెడ్డి నటనకు గానూ విజయ్‌ దేవరకొండ ఫిలింఫేర్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కేటీఆర్‌ స్పందిస్తూ విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

అయితే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. మీ ఇంటికి లంచ్‌ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం.. ‘అసలు ఏం జరుగుతోంది బాసు‌?’ .. బేసికల్లి ఏమైనా జరుగొచ్చు. మనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే…అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు నా ఫిల్మ్‌ఫేర్‌ చూపించా, వేలం గురించి మాట్లాడాం. చేనేత కార్మికులు, వస్త్రాలు, నీటి నిర్వహణ, ఎందుకు హైదరాబాద్‌ రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి, చరిత్ర, తన తండ్రి-కుమారుడి గురించి ఆయన మాతో ముచ్చటించారు. ‘విజయ్‌ ప్లాస్టిక్‌ వాడటం ఆపు’ అని అన్నారు’ అంటూ కేటీఆర్‌ సిటీని చూపిస్తున్న ఫొటోను పంచుకున్నారు.