నన్ను నమ్మండి.. ప్రతి ఒక్కరు నాకు సమానమే: నాని

తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్‌- 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ షోకి హీరో నాని హోస్ట్‌ వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇది అంతా స్క్రిప్టెడ్‌ గేమ్‌ అని తనీష్‌ లేక గీతామాధురిల్లో ఒకరిని విజేతగా ప్రకటించడానికే బిగ్‌బాస్‌ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. హౌస్‌లో జరిగే ప్రతి విషయంపై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. గత వారం నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ సరిగ్గా జరగలేదని, ఓట్లు ఎక్కవ వచ్చినా కావాలనే ఎలిమినేట్‌ చేశారని షో నిర్వాహకులు, హోస్ట్‌ నానిపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. ఎలిమినేట్‌ చేయాలనుకుంటే డైరెక్ట్‌ చేయాలని కానీ తమ ఓట్లు అడిగి అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

బిగ్‌బాస్‌ షోపై నమ్మకం పోయిందని, హోస్ట్‌ నాని కూడా వారి పక్షాన నిలుస్తూ మద్దతు తెలుపుతున్నారని ప్రేక్షకులు కామెంట్‌ చేస్తున్నారు. కొందరైతే నాని మూవీ ‘దేవదాసు’ ను బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. ఇంకొందరు తమ అభిమాన హీరో నానియే తమని మోసం చేస్తున్నాడని, అతనిపై ఉన్న గౌరవం పోయిందని సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ మేరకు నాని తాజాగా ఓ పోస్ట్‌ చేశారు. తనకు అందరూ సమానమే అంటూ ప్రకటన విడుదల చేశారు. మీతో ఓ విషయం పంచుకోవాలని ట్విటర్‌లోకి వచ్చా. ‘బిగ్‌బాస్‌’ గురించి మీరు చేసిన కామెంట్స్‌ చూశాను. నేను మీకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ‘బిగ్‌బాస్’‌ బృందం చెప్పింది. కానీ ఇవ్వకుండా ఎలా ఉండగలను. ఇదిగో షోకు సంబంధించి నా చివరి స్పందన అంటూ నాని ట్వీట్‌ చేశారు.

షో విషయంలో మీలో కొందరు నా వల్ల బాధపడి ఉంటే క్షమించండి. కానీ మీరు మీ కోణంలో‌ ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టమైన హౌస్‌మేట్‌ను ఎప్పుడూ ప్రత్యేకంగా చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఓ హోస్ట్‌గా నేను మీలా ఆలోచించలేను. నావైపు నుంచి అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. మీరు హౌస్‌లో ఒకరికి అభిమానై ఉంటారు కాబట్టి నేను అందరికీ సమానమైన అవకాశం ఇస్తున్నప్పుడు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాను అనిపించొచ్చు. కానీ నన్ను నమ్మండి. హౌస్‌లోని ప్రతి ఒక్కరు నాకు సమానమే. మీ ఆదరణతో హౌస్‌లోని ఉత్తమ వ్యక్తి విజయం సాధిస్తారని అందరికీ తెలుసు. ఓటింగ్‌, ఎలిమినేషన్‌ విషయాల్ని నేను చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నిజంగా అందులో నా ప్రమేయం ఉంటుందని భావిస్తున్నారా?.. ఇక దాన్ని మీకే వదిలేస్తున్నా (నవ్వుతూ). ఓ నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు ది బెస్ట్‌ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఈ విషయంలో నా ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. నన్ను ద్వేషించినా, ప్రేమించినా.. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్థం చేసుకుంటే దాని ప్రభావం నాపై ఉంటుంది. కానీ అది నన్ను కిందకి పడేస్తుందా? లేదు.. ఇంకా ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తా. లవ్‌.. నాని’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.