నాని కొత్త సినిమా టైటిల్‌

నేచురల్‌ స్టార్‌ నాని కొత్త సినిమా టైటిల్‌ రిలీజ్‌ చేశారు. హీరో ‘నాగార్జున’తో కలిసి మల్టీ స్టారర్‌ సినిమాలో నటిస్తున్న నాని అదే సమయంలో ‘బిగ్‌బాస్2’ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇంత బిజీలోనూ నాని తన తరువాత చిత్రాల పనులు చకచకా కానిచ్చేస్తున్నాడు. నాని 23వ సినిమాకు సంబంధించిన ప్రకటన శుక్రవారం చేస్తామని నిర్మాతలు ముందే ప్రకటించారు. ఈరోజు ఉదయం నాని తన ట్విటర్‌ ద్వారా కొత్త సినిమా గురించి చెప్పేశాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.5 గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ పోస్టర్‌ విడుదల చేశారు. క్రికెట్‌ బ్యాట్‌, గ్లౌసులు, హెల్మెట్‌, చూస్తే ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు అనిపిస్తోంది. జెర్సీ మీద అర్జున్‌ 36 అని రాసి ఉండటాన్ని బట్టి చూస్తే హీరో క్యారెక్టర్‌ పేరు అర్జున్‌ అయి ఉంటుందని భావిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.