నా నిశ్చితార్థానికి నన్ను పిలవలేదు: తాప్సీ

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి నటిగా రాణిస్తున్న ముద్దుగుమ్మ తాప్సీ.. ఆమె నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ ఆటగాడు మథియస్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోవాలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగిందని, త్వరలో వివాహ వేడుకను నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి.

తాప్సి ఈ వార్తలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. తనకు తెలియకుండానే తన నిశ్చితార్థం జరిగిపోయిందని పరోక్షంగా వార్తల్ని ఖండించారు. ‘నిజంగా.. నా నిశ్చితార్థానికి నన్నే ఆహ్వానించకపోవడం విచిత్రంగా ఉంది. గత పదేళ్లలో నా తల్లిదండ్రులు ఒక్కసారీ గోవాకు వెళ్లలేదు. పదేళ్ల క్రితమే.. నాకు నిశ్చితార్థం జరిగిందని మీరు అనుకోవాల్సిందే’ అని తాప్సి ట్వీట్‌ చేశారు.