నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న బాబు

పింఛన్లు ఇస్తున్నామంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నాం అంటున్నారు… వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు కావచ్చు.. ఇక రైతుల విషయాలల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కానీ యువతకు ఉద్యోగాలను కల్పించడంలో మాత్రం చంద్రబాబు చాలా మోసం చేశారని కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రగల్భాలు పలికిన బాబు ఆ తరువాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ నిరుద్యోగ భృతి శ్రుతి పలుకుతూ యువకులకు మాయమాటలు చెబుతున్నారు.

2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. నాలుగున్నరేళ్లు గుర్తుకురాని ఈ హామీ ఎన్నికల హడావుడి మొదలుకాగానే ‘యువనేస్తం’ పేరిట యువకులకు బురిడీ కొట్టించారు. ఎన్నికల సమయంల ఆరునెలల ఉందనగానే ఈ పథకాన్ని ప్రారంభించి తమ ప్రభుత్వం ఎంతో బాగా చేస్తుందని నిరుద్యోగులకు టోకరా వేస్తున్నారు.

వృద్ధాప్య పింఛన్‌ ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది. కానీ నిరుద్యోగభృతి ద్వారా అర్హులు ఎంతమంది ఉన్నా వారికి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 1.75 కోట్ల ఇళ్ల కుటుంబాలకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు 2018 ఆగస్టు 2న కేబినేట్‌ సమావేశమై ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకంపై మంత్రి లోకేశ్‌ పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందని, అయితే డిగ్రీ పూర్తి చేసి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేసినా దీనికి అనర్హులని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మందికి, ప్రతి ఒక్కరికి రూ.వెయ్యి రూపాయలు ఇచ్చేలా నిర్ణయించారు. దరఖాస్తులు అంతకు మించి వస్తే వారికి రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

2014 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రతి నిరుద్యోగికి రూ. 2వేలు పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ రూ. వెయ్యి మాత్రమే ప్రకటించారు. అది కూడా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు. ఇప్పుడు తాము నిరుద్యోగులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. 2014 హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి లక్షా 20వే బాకీ పడ్డారని, అవి ఎప్పుడు ఇస్తారో తెలుపాలని సోషల్‌ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు బాబు నిరుద్యోగులకు ఇచ్చింది అమలు చేసిన ఈ మూడు నెలల్లో కేవలం రూ.6వేల మాత్రమేనని లెక్కలు వేసీ మరీ చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే కేవలం ఎన్నికల కోసమే బాబు జిమ్మిక్కులు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.