నేచురల్ స్టార్ నానికి పదేళ్లు

తన కుమారుడు అర్జున్‌తో కలిసి సరదాగా దిగిన ఫొటోను హీరో నాని ట్విటర్‌లో పంచుకున్నారు. ఎవరి ముందైనా నటించడానికి ఎన్నడూ భయపడింది లేదు. కానీ మిస్టర్‌ జున్ను ఈ రోజు డాక్టర్‌ దాస్‌ను కలవడానికి సెట్స్‌కు వచ్చాడు అని ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు నాని.

ఇండస్ట్రీకి రాకముందు నాని రేడియో జాకీగా పనిచేసేవారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అసిస్టెంట్‌ దర్శకుడిగా వచ్చారు. శ్రీను వైట్ల, బాపులాంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత అష్టా చమ్మ చిత్రంతో నాని కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా తర్వాత నాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రైడ్‌, అలా మొదలైంది, ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, నిన్నుకోరి వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం నాని కథానాయకుడిగా “దేవ్‌దాస్‌” చిత్రంలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన కథానాయికలుగా నటిస్తున్నారు. దీంతో పాటు నాని సెలబ్రిటీ రియాల్టీ షో “బిగ్‌బాస్‌”కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

నేచురల్‌ స్టార్‌ నాని తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి నేటికి పదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో నాకు అభిమానుల నుంచి ఎంతో ప్రేమ లభించింది. ఎవరు ఊహించి ఉంటారు నేను చిత్ర పరిశ్రమలో పదేళ్లు ఉంటానని? ఎవరు ఊహించి ఉంటారు నటనలో యావరేజ్ నైపుణ్యాలు ఉన్న నాలాంటి యావరేజ్‌ అబ్బాయిని ఆదరిస్తారని? మీ అందరి ప్రేమాభిమానాలతో ఓ నటుడిగా, మనిషిగా నేను ఎదిగాను. నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజు నుంచి నా నుంచి బెస్ట్‌ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా మనసునే అనుసరించాను..అనుసరిస్తుంటాను. విజయాన్ని రుచిచూశాను. పరాజయాన్ని చవిచూశాను. ఈ రెండూ జీవితంలో వచ్చిపోతుండేవే. మీరు నాపై చూపిన ప్రేమాభిమానాలకు థాంక్యూ కూడా తక్కువే. కానీ మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు మాత్రమే చెప్పుకోగలను. మీ నాని.. అని పోస్ట్‌లో పేర్కొన్నారు.