నేను గ్యాంగ్‌స్టర్‌, నాని వైద్యుడు: నాగార్జున

అగ్ర కథానాయకుడు నాగార్జున ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ కథానాయకుడు నాని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘నానితో కలిసి నేను చేస్తున్న కొత్త చిత్రం రాజ్‌కుమార్‌ హిరాణీ శైలిలో సాగే పోయే సినిమాలా ఉంటుంది. ఇందులో నేను గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నా. నాని నాకు వైద్యం చేసే డాక్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇది చాలా సరదాగా సాగిపోయే స్క్రిప్ట్‌. శ్రీరామ్‌ ఆదిత్య ప్రత్యేకత ఇందులో కనపడుతుంది’ అని అన్నారు.

“ఒక మూవీలో ఇద్దరు హీరోలు నటిస్తే సమస్య రాదా? అని అడిగితే.. ఇతర నటుల కారణంగా నా కెరీర్‌ డోలాయమానంలో పడుతుందని నేనెప్పుడూ భయపడలేదు. మొదట్లో నేను సోలో హీరోగా చాలా సినిమాలు చేశా. అవకాశాలు అలా వచ్చాయి. ఇటీవల వస్తున్న మల్టీస్టారర్‌ కథలతో చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది. ‘ఊపిరి’ లో కార్తితో పనిచేయడం భలే సరదా అనిపించింది. నానితో కూడా అలాగే ఉంది.” అంటూ నవ్వుతూ చెప్పేశారు.

ప్రియదర్శన్‌ దర్శకత్వంలో ఓ సాహస చిత్రంలో చేస్తున్నారని ఇటీవల వచ్చిన వార్తలను నాగార్జున ఖండించారు. ఓ నవల ఆధారంగా 16వ శతాబ్దంలో సాగే కథతో ఈ సినిమా ఉంటుందంటూ వార్తలు వినిపించాయి. దీనిపై నాగార్జున సమాధానమిస్తూ.. ‘ప్రియదర్శన్‌ను కలిశాను. కానీ, స్క్రిప్ట్‌ వినలేదు. జూన్‌ చివర్లో పూర్తి స్క్రిప్ట్‌ వింటా. ప్రస్తుతానికి నానితో కలిసి నటిస్తున్న సినిమాలో బిజీగా ఉన్నా’ అని అన్నారు. విరామం లేకుండా పనిచేయడం వల్ల తానేమీ ఒత్తిడికి గురికావడం లేదని, ప్రతి పాత్ర‌.. తనకో సవాల్‌ అని అన్నారు. ఇంతకు ముందు చేయని పాత్రలను చేయాలంటే మరింత ఇష్టం అని చెప్పుకొచ్చారు.