‘పందెం కోడి 2’ టీజర్‌

హీరో విశాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పందెం కోడి 2’ 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. తమిళంలో సందకోళి 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై విశాల్‌, ధావల్‌ జయంతిలాల్‌, అక్షయ్‌ జయంతిలాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ లేడీ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.

‘మళ్లీ కత్తి పట్టే దమ్ముంటే వచ్చి నరకరా..నేనీ సీమలోనే ఉంటా.. అంటూ పందెంకోడి చిత్రంలో విశాల్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత సీక్వెల్‌కు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడమే మొదలుపెట్టాను అని విశాల్‌ చెప్తున్న డైలాగ్‌కు..పక్కనే ఉన్న కీర్తిసురేశ్‌ ఈల వేయడం హైలైట్‌గా నిలిచింది. ఇది పులి మేక ఆట కాదు..పులి, మేక కలిసి ఆడే ఆట అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.