పెళ్లి వీడియో పోస్ట్ చేసిన సమంత

పెళ్లైన 9 నెలల తరువాత సమంత తన పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకుంది. తాజాగా ఇదిగో మా పెళ్లి వీడియో అంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో నాగచైతన్య-సమంత ఒకటి. గతేడాది అక్టోబర్‌ 6న గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఈ జంట వివాహబందంధంతో ఒకటైంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంతా పెళ్లి తర్వాత సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో తన పెళ్లికి సంబంధించిన చిన్న చిన్న వీడియోలు, ఫొటోలు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చాయి. కానీ అసలైన వివాహ వీడియోను ఈ రోజు సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘మీకు ప్రామిస్‌ చేసినట్లుగానే మా పెళ్లికి మిమ్మల్ని ఆహ్వానించాను. ఇంత చక్కగా మా వెడ్డింగ్ వీడియో తీసినందుకు ధన్యవాదాలు వెడ్డింగ్ ఆల్బమ్‌ చేసిన జోసెఫ్‌ రధిక్‌ గురించి అన్నారు. మీరు దేశంలోనే బెస్ట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియోలో నాగచైతన్య పెళ్లి కొడుకులా ముస్తాబవుతూ..’టై ఎక్కడ’ అని అఖిల్‌ను అడగడం… మరోపక్క సమంత ‘వీ కెన్‌ డూ దిస్‌’ అంటూ చిన్న పిల్లలా డ్యాన్స్‌ చేయడం ఆకట్టుకుంటోంది. పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య, రానా, అఖిల్‌ చేసిన డ్యాన్సులు, కలిసి దిగిన ఫొటోలు చూపించారు.

వివాహమైనప్పటి నుంచి సమంత తన భర్తతో ఉన్న అనుబంధం గురించి సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లిన విహారయాత్రలు, పార్టీల గురించి పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. వివాహం అయ్యాక ఇద్దరూ కలిసి టూర్‌ నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం సమంత..’యూటర్న్‌’ ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ చిత్రాల్లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో చై-సామ్‌ ఓ చిత్రంలో నటించబోతున్నారు. వివాహం అయ్యాక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది.