ప‌వ‌న్‌కు కంటి స‌మ‌స్య‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘జ‌న‌సేన పార్టీ’ పోరాట యాత్రల‌ గురించి తెలిసిందే. క్రిందటి నెల‌లో ఇచ్చాపురం నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ పవన్‌ ప్ర‌జా పోరాట‌ యాత్ర సాగింది. ఈ నెలలో 26 నుంచి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఈ యాత్ర‌ల‌కు ఓ ఆరోగ్య స‌మ‌స్య‌ పెద్ద బ్రేక్ వేస్తోందట‌. ప‌వ‌న్ ప్ర‌స్తుతం కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇదివ‌ర‌కూ పోరాట యాత్ర‌లో ఈ స‌మ‌స్య పెద్ద‌ చిక్కులు తెచ్చిపెట్టింది. అందుకే ఆయ‌న యాత్ర ఆద్యంతం న‌ల్ల కళ్లద్దాలతోనే క‌నిపించారు. ఆ స‌మస్య ఇంకా అలానే ఇబ్బందిపెడుతోందట‌.

ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్ – ఎల్‌వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి డాక్ట‌ర్ల‌ను ప‌వ‌న్ చికిత్స కోసం సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. కంటికి ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో అత‌డు అందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. అయితే శ‌స్త్ర‌చికిత్స తేదీ ఖ‌రారు చేయాల్సి ఉంది. జూన్ 26 యాత్రను ముగించుకున్న తరువాత శ‌స్త్ర చికిత్స‌కు రెడీ అవుతార‌ని సమాచారం.