ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ “f2” “ఫన్ అండ్‌ ఫ్రస్ట్రేషన్” ఉపశీర్షిక.. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. యూనిట్‌ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను వరుణ్‌ ట్విటర్‌లో షేర్‌‌ చేశారు. “అద్భుతమైన బృందంతో సూపర్‌ ఫన్‌ చిత్రం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది” అంటూ ట్వీట్‌ చేశారు.

“f2” చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌ రావిపూడి-దిల్‌రాజు కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా “f2” ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌ సినిమాలు మంచి హిట్‌ అందుకున్నాయి. వరుణ్‌ ప్రస్తుతం ఘాజీ దర్శకుడు సంకల్ప్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌లు. మరోపక్క వెంకటేశ్‌-తేజ కాంబినేషన్లో ఓ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. దీనికి “ఆటనాదే వేటనాదే”అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.