ఫైనాన్స్ కమిషన్ అంచనాలతో ఏపీకి నష్టం

14వ ఫైనాన్స్ కమిషన్ అంచనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయి సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఆర్థిక సంఘం అంచనాలకు, వాస్తవంగా ఏపీకి వస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవడంతో ఏపీ పెద్దమొత్తంలో రెవెన్యూ లోటు గ్రాంట్‌ను నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. నాలుగేళ్లుగా ఏపీకి వచ్చిన ఆదాయ, వ్యయాల లెక్కలను, 14వ ఫైనాన్స్ కమిషన్ అంచనాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలిపింది.

నవ్యాంధ్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పాత లెక్కలు, భవిష్యత్తు అవసరాలపై స్పష్టత లేకపోవడం వల్లే ఆర్థిక సంఘం సరిగా అంచనా వేసి ఉండకపోవచ్చని వారు పేర్కొన్నారు. ఫలితంగా 2015-20 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1.22 కోట్ల నష్టం ఏర్పడుతున్నట్లు పార్లమెంటు స్థాయీ సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు 2015-20 మధ్య ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ. 22 వేల కోట్లు సిఫార్సు చేసినా ఆ కాలంలో రాష్ట్రానికి 1.45 లక్షల కోట్ల లోటు ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల విషయంలో ఫైనాన్స్ కమిషన్ అంచనాల్లో 5 నుంచి 10 శాతానికి మించి తేడా రావడం లేదని ఏపీ అధికారులు వివరించారు.