బరువు పెరగలేదు.. తగ్గాను: కీర్తి సురేష్!

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగాశ్విన్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మార్చి నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోన్న కీర్తి సురేష్ పాత్ర కోసం బరువు బాగా పెరిగిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన కీర్తి పాత్ర కోసం బరువు పెరగలేదని.. యంగ్ సావిత్రి పాత్ర కోసం బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. చివరిదశలో సావిత్రిని లావుగా చూపించడం కోసం ప్రోస్తటిక్ మేకప్ వాడుతున్నామని స్పష్టం చేసింది.

ఈ సినిమాలో దాదాపు 120 కాస్ట్యూమ్స్ ధరించానని అన్నారు. సావిత్రి జీవితంలో ఉన్న నెగెటివ్ అంశాలను చూపించడం లేదన్న కీర్తి ఆమె జీవితం గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్ తో పాటు సమంత, విజయ్ దేవరకొండలు మరో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.