బాబు దూకుడు.. దానికోసమే అధికార దుర్వినియోగం..

ఎన్నికలు ముగిశాయి. కోడ్ అమల్లో ఉంది.అయినా సీఎం చంద్రబాబు సమీక్షలు అంటూ టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసీ దీనికి అడ్డుకట్ట వేయాలంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ ను చూపించి కోరుతున్నా బాబు ససేమిరా అంటున్నారు. తనకు జూన్ వరకు అధికారం అంటూ ఆదిపత్యం చెలాయిస్తున్నాడు. ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టినా ఆంక్షలు పెట్టిన బాబు తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు.

వాస్తవానికి ఏపీలో అసాధారణ పరిస్థితులు, సంక్షోభాలు ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు అధికారులతో సమీక్షలు, పాలనా వ్యవహారాలు నిర్వహించాలి. కానీ అలాంటి పరిస్థితి లేకపోయినా బాబు అన్నీ వ్యవహారాలు టీడీపీకి అనుకూలంగా చక్కబెడుతున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తోపాటు మంత్రులపై చర్యలు చేపట్టే అవకాశం చట్టంలో లేకపోవడమే బాబు దూకుడుకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాల్లో 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుకు కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి తెలియంది కాదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఫలితాలు వచ్చేదాకా నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు నడుచుకోవాలి. కానీ బాబు మాత్రం చిత్రంగా దూకుడు పెంచడం చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్న సమాచారంతోనే బాబు టీడీపీకి మేలు చేకూరేనా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే కోడ్ ఆఫ్ కండక్ట్ ను పక్కనపెట్టి ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. చంద్రబాబు తాజా వ్యూహంపై ఎన్నికల సంఘం చీవాట్లు పెట్టేదాకా వ్యవహారం వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.