బాలయ్య సరసన రకుల్‌ ప్రీత్

నందమూరి తారక రామారావు బయోపిక్‌ తెలుగు సినీ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి, సీఎం అయ్యే వరకూ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, అరుదైన ఘట్టాలకు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దృశ్యరూపం ఇవ్వబోతున్నారు. టైటిల్‌రోల్‌, తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ వెండితెరపై ఎలా ఉంటారా? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్‌ సతీమణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబునాయుడుగా రానా చేస్తున్నాడని.. ఏఎన్నార్ పాత్రను సుమంత్‌ చేయబోతున్నాడని ఇప్పటికే అనుకుంటున్నారు. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్‌కీ ఈ సినిమాలో నటించే అవకాశం దొరికిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఎందరో కథానాయికలతో కలిసి నటించారు. వారందరి జీవితాలను కూడా తెరపై చూపించబోతున్నారు. అంజ‌లీదేవి, సావిత్రి నుంచి జ‌య‌సుధ‌, జ‌యప్ర‌ద వ‌ర‌కూ చాలామంది
హీరోయిన్లు ఎన్టీఆర్‌తో నటించారు. అందులో ఓ హీరోయిన్‌ పాత్రను రకుల్ చేస్తున్నట్లు స‌మాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇంకా సినిమాలో ఎవరెవరు ఏ పాత్రలో కనిపిస్తారో చూడాలి.