బాలీవుడ్ మూవీలో జగ్గుబాయ్‌ లుక్

టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు జగపతి బాబు లెజెండ్‌ సినిమాతో విలన్‌గా మారాడు . ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్‌ స్టార్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ ఫాంలో దూసుకుపోతున్న జగ్గూభాయ్‌ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు నటిస్తున్న హిందీ సినిమాకు సంబంధించిన లుక్‌ లీకైంది.

బాలీవుడ్ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ తానాజీ. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్‌ తానాజీ పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.