బిగ్‌బాస్‌ పై మండిపడ్డ పరుచూరి

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నఅతిపెద్ద రియల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’. నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్‌, గీతామాధురి, దీప్తి, తనిష్‌, సామ్రాట్‌, అమిత్‌, రోల్‌రైడాలు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ బిగ్‌బాస్‌ షో, అందులో నిర్వహిస్తున్న టాస్క్‌లపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘నేనెప్పుడూ ఇలా మాట్లాడలేదు. కానీ, ఈరోజు మాట్లాడాలనిపించింది. గతంలో ఈ షోను చిన్నరామయ్య(ఎన్టీఆర్‌) చేసినప్పుడు నా ఆనందాన్ని పంచుకున్నా. ఇప్పుడు కూడా నచ్చింది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనమరుగవుతున్న రోజుల్లో ఎలాంటి రక్త సంబంధం లేని 14మందిని ఒక ఇంట్లో కూర్చోబెట్టి, 70రోజుల పాటు రియాల్టీ షో నడపాలంటే భాష, సమయస్ఫూర్తి కావాలి. అయితే, ఇప్పుడు నా ఆవేదన పంచుకోవడానికి వచ్చా. ఒక పెద్దవాడిగా బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న కొన్ని అంశాలు జీర్ణించుకోలేకపోతున్నా అని పరుచూరి తెలిపారు. బిగ్ బాస్ లో జరిగే కొన్ని సంఘటనలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు ఆకాశంలో చెరో సగం. కానీ శరీర నిర్మాణంలో మాత్రం వ్యత్యాసం ఉందని అన్నారు. బిగ్ బాస్ షోలో స్త్రీ పురుషులిద్దరికీ పరిగెత్తే పోటీ ఒకటి నిర్వహించారు. కొంత మంది ఆడపిల్లలు పడిపోయారు. చాలా భాదగా అనిపించింది. ఇలాంటి పోటీలు నిర్వహించడం సరైనది కాదని అన్నారు.

క్రీడలో కొన్ని నియమాలు తప్పితే జీవితకాలం నిషేధం విధించిన సందర్భాలు ఉన్నాయని పరుచూరి అభిప్రాయపడ్డారు. పురుషులు స్త్రీలని బలవంతంగా నెట్టివేయడం క్రీడా స్ఫూర్తి కాదని అభిప్రాయం పడ్డారు. ఓ నామినేషన్ టాస్క్ లో ఫోటోలు తగలబెట్టడం చూశా. నేను బయటకు వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చా. నా భార్య బిగ్ బాస్ చూస్తోంది. టాస్క్ లో భాగంగా ఫోటోలు తగలబెడుతున్నారు. వెంటనే టీవీ ఆఫ్ చేయమని నా భార్యకు చెప్పా. బ్రతికున్న వారి ఫోటోలు తగలబెట్టడం ఏంటి ? ఈ నాగరికత ఎక్కడి నుంచి వస్తోంది ? వికృత రూపంలో వినోదాన్ని అందించే షోలు అవసరం లేదు అని పరుచూరి మండిపడ్డారు. ఈ విషయం చాలా రోజుల నుంచి చెబుతామని అనుకుంటున్నా. కానీ, చివర్లో చెబితే బాగుంటుందని అనిపించింది. నాని కూడా ఈ షోను చాలా చక్కగా నడిపిస్తున్నారు.’ అంటూ షో గురించి తన అభిప్రాయాలను వీడియోలో పంచుకున్నారు.