బీజేపీతో పొత్తు విషం తాగడంతో సమానం: ముఫ్తీ

జమ్ముకాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడంతో సమానమని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మళ్లీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు అంగీకరించామని కానీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడమనేది విషం తాగడంతో సమానం అన్నారు. రెండేళ్ల పాటు ఆ బాధను భరించానని ముఫ్తీ అన్నారు. పీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీతో చేతులు కలపడమనేది ఒక కప్పు విషం తీసుకోవడమేనని అన్నారు. పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్‌లో ముఫ్తీ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్‌ పాలన నడుస్తోంది. అప్పటి నుంచి ముఫ్తీ ప్రతి సందర్భంలోనూ భాజపాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పీడీపీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల ఆమె బీజేపీని హెచ్చరించారు. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తే కాశ్మీర్‌
ప్రజలకు భారత ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందని మండిపడ్డారు.